హెచ్‌బీఏ1సీ లేదా గ్లైకోనేటెడ్ హీమోగ్లోబిన్ టెస్ట్ ద్వారా మన రక్తంలో మూడు నెలల ముందు నుంచి సగటు చక్కెర శాతం ఎంతవరకు ఉందనేది తెలుస్తుంది. సాధారణంగా రక్తంలోని ఎర్రకణాలలోని హీమోగ్లోబిన్‌కు చక్కెర అంటుకుంటుంది. సుగర్ ఉన్నవాళ్లలో చక్కెర ఎక్కువగా అంటుకుంటుంది కాబట్టి హెచ్‌బీఏ1సీ ఎక్కువగా ఉంటుంది. హెచ్‌బీఏ1సీ 5.7 శాతం కంటే తక్కువగా ఉంటే, సుగర్ నార్మల్‌గా ఉన్నట్లు.
ఇది 5.7–6.4 శాతం మధ్య ఉన్నట్లయితే, ప్రీడయాబెటిక్ రేంజ్‌లో ఉన్నట్లు–అంటే, వీరికి త్వరలోనే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి నుంచే ఆహార నియమాలను పాటించేటట్లయితే, డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. హెచ్‌బీఏ1సీ 6.5 శాతం కంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్ ఉన్నట్లు. మీకు హెచ్‌బీఏ1సీ 7.7 ఉంది. గర్భం మూడోనెల. అంటే, గర్భం రాకముందు నుంచే మీకు డయాబెటిస్ ఉన్నట్లుంది. ఇంతకుముందు ఎప్పుడూ సుగర్ టెస్ట్ చేయించుకుని ఉండరు కాబట్టి సుగర్ ఉన్నట్లు తెలియలేదు.
గర్భం లేకుండా ఉన్నట్లయితే, సుగర్ మందులతో పాటు, ఆహారపు అలవాట్లను కఠినంగా మార్చుకుని, ఆహార నియమాలను పాటించినట్లయితే హెచ్‌బీఏ1సీ మూడు నెలల్లో సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాని, ఇప్పుడు మూడోనెల గర్భం కాబట్టి ఒకసారి ఎండోక్రైనాలజిస్టును సంప్రదిస్తే, వారు తినకముందు, తిన్న తర్వాత సుగర్ లెవల్స్ ఎలా ఉన్నాయో పరీక్షించి, వాటిని బట్టి సుగర్ అదుపులోకి రావడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు, మందులు ఇవ్వడం జరుగుతుంది.