దేశంలో పామాయిల్ సాగు ప్రోత్సాహం కోసం రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో వంట నూనెల అందుబాటును విస్తృతం చేసేందుకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్‌ఎంఈవో) పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో 27.99 లక్షల హెక్టార్లు పామాయిల్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని కమిటీ అంచనా వేసిందని తెలిపారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి, సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచి వంటనూనెల దిగుమతి వల్ల పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్‌ఎంఈవో బృహత్తర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ ధరల్లో హెచ్చు తగ్గుల నుంచి పామాయిల్ రైతులను కాపాడేందుకు వీలుగా గిట్టుబాటు ధర విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి చెప్పారు.