మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ) కూటమి భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు సమావేశమయ్యాయి. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాంతాలను బట్టి ఉమ్మడిగానా లేదా స్వతంత్రంగానా? అనేది నిర్ణయం తీసుకోనున్నారని ఆయా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ..‘మూడు పార్టీలు కలిసికట్టుగా కోవిడ్-19 మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. దాంతో పోలిస్తే ఈ ఆటంకం(షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం) చాలా చిన్నది. దానిని మేము అధిగమించి కలిసే ఉన్నామని దేశానికి సందేశం ఇస్తాం. గతంలో కంటే ఇప్పుడే ఎంవీఏ బలంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము కలిశాం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనివ్వండి.’ అని పేర్కొన్నారు ఉద్ధవ్ థాక్రే.