సంతానం కోసం ఎంతో మంది దంపతులు ఎదురు చూస్తుంటారు. ఒకరు పుడితే ఓకే.. అదే ఒకేసారి ఇద్దరు పుడితే.. వారికి ఆ సంబరమే వేరు. మొదటిసారే అయినా, ఇప్పటికే పిల్లలున్నా.. మళ్లీ కవలలు పుడితే అదో ఆనందం, ఆశ్చర్యం.. మరి ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య పెరిగిపోతోందని తెలుసా? ఒకరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఏటా 16 లక్షల మంది కవలలు పుడుతున్నారు. ఇది మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో కవలల బర్త్ రేటు ఎక్కువగా ఉంటోంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ప్రస్తుతం ఆఫ్రికాలో కవలల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కవలల పుట్టుకలో భారత్, చైనాలే టాప్‌కు చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 165 దేశాల్లో 1980–1985 మధ్య, 2010–2015 మధ్య పుట్టిన కవలలకు సంబంధించి డేటాను ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు సేకరించి విశ్లేషించారు. మొత్తం ప్రసవాల్లో పుట్టిన కవలల శాతాన్ని.. అప్పటికి, ఇప్పటికి పోల్చి చూశారు. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందన్నది లెక్కించి ఒక నివేదికను రూపొందించారు.