‘తెలంగాణ పట్ల కేంద్రానికి ఎం దుకు వివక్ష? రాష్ట్రాన్ని ఎందుకు శత్రువులా చూస్తున్నారు, ఎందుకు విరోధం పెంచుకుంటున్నారు’ అని టీఆర్ఎస్ ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి విభజన సమస్యలను పరిష్కరించడంలో ఎనిమిదేళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. సోమవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను వీరిద్దరూ లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్కప్రాజెక్టులో కూడా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. దేశంలో అనేక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.