మరో చోట ఐఐటీ చదివే విద్యార్ధి యూట్యూబ్ వీడియోలు చేస్తూ దానికి ఆదరణ లేదని (మరి కొన్ని కారణాలు) ఆత్మహత్య చేసుకొన్నాడు. పెద్దగా చదువుకోని వారు కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. మరి.. నువ్వు చదివే చదివేంటి ? చేస్తున్న వీడియోలు ఏంటి ? అంతకు మించి వీడియోలకు జనాదరణ ఎలా పెంచుకోవాలో తెలియకపోవడం.. పోనీ రాలేదు. అదే జీవితం అనుకొని తనువు చలించడం. ఏంటిది ?
లక్షమంది పోటీ పడితే వందమందికి కూడా సీట్ దక్కని ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థల్లో సీట్ సాధించిన వారు నిస్సందేహంగా తెలివైన వారే ! కానీ రెండేళ్లు ప్రేమించినా అబ్బాయి తత్త్వం అర్థం చేసుకోలేని బేలతనం.. ఒకసారి అబార్షన్ అయితే అటుపై పుట్టే పిలల్లకు మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది అని తెలుకోలేని అజ్ఞానం. అవతలి వాడు ప్రేమిస్తున్నది తన జీతాన్ని.. తనకు కంపెనీ ఇచ్చిన షేర్లను అని తెలుసుకోలేని అమాయకత్వం.. ఏంటివన్నీ?
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్, మెడికల్ సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ లాంటి సబ్జెక్టులలో నైపుణ్యం సాధిస్తే అకాడమిక్ లేదా డొమైన్ ఇంటలిజెన్స్ అంటారు. సంగీతం లో పట్టుంటే మ్యూజిక్ ఇంటలిజెన్స్.. భాషపై పట్టుంటే లింగ్విస్టిక్ ఇంటలిజెన్స్.