ఒక కాన్పులో కవల పిల్లలు (ట్విన్స్) పుట్టడమే ప్రత్యేకమైన విషయం. అలాంటిది ముగ్గురు పిల్లలకు (ట్రిప్లెట్స్) జన్మనివ్వడం అరుదు. మరి నలుగురు పిల్లలకు (క్వాడ్రప్లెట్స్) జన్మనివ్వడమంటే అసాధారణమనే చెప్పాలి.
ఇలాంటి అసాధారణ సంఘటనే జరిగింది ఒడిశాలో. ఒక మహిళ బుధవారం ఏకంగా నలుగురు పిల్లలకు జన్మిచ్చింది. ఒడిశా, సంబల్‌పూర్ జిల్లా, వీర్ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ (విమ్సార్) లో ఈ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. సోనెపూర్ జిల్లా, బంజిపాలి గ్రామానికి చెందిన కుని సునా అనే గర్భిణి పురిటి నొప్పులతో సోమవారం విమ్సార్‌లో చేరింది. కుని సునాకు బుధవారం అర్ధరాత్రి వైద్యులు డెలివరీ చేశారు. ఆమెకు ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. వీరిలో ముగ్గురు ఆడ పిల్లలు కాగా, ఒకరు మగ పిల్లాడు.