గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలిచింది.
2014 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు, 2018 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీని ఓడించి ఫైనల్ చేరి తుది పోరులో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలైంది. మూడోసారి మిషెల్లి లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచింది. చివరిసారి ఎనిమిదేళ్ల క్రితం సింధును ఓడించిన మిషెల్లి ఈసారి తన ప్రత్యర్థికి అంతగా పోటీనివ్వలేకపోయింది.