ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సమస్య ఒబెసిటీ. వ్యక్తుల ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం వంటి అనేక కారణాలతో ఇప్పుడు ఇదొక జీవనశైలికి సంబంధించిన అంశంగా మారింది. అందరూ దీనిని కేవలం అధిక బరువుతోనే కొలుస్తుంటారు. అయితే ఇది అంతకు మించిన తీవ్రమైన పరిస్థితిగా పరిగణించి పూర్తి స్థాయి చికిత్స చేయాలి అంటున్నారు కేర్ ఆసుపత్రికి చెందిన డా.బిపిన్ సేథీ. రోజువారీ జీవనం మీద ఒబెసిటీ ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. హృద్రోగం, డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, కీళ్ల నొప్పులు.. ఇంకా అనేక ఇతర తీవ్రమైన అనారోగ్యాలతో పాటు కొన్ని రకాల కేన్సర్‌లకూ కారణమవుతుంది. కేవలం శారీరకమైనవే కాకుండా డిప్రెషన్, న్యూనతాభావం తదితర మానసిక సమస్యలకూ ఇది దోహదం చేస్తుంది.