సూది, నొప్పి.. రెండూ లేకుండా కరోనా వ్యాక్సిన్ డోసు ఇవ్వడం సాధ్యమేనా?. అవును.. మన దేశంలోనూ ఈ తరహా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం పాట్నా(బిహార్)లో మూడు వ్యాక్సిన్ సెంటర్‌లలో ఈ తరహా ప్రయోగాన్ని అమలు చేశారు.
సూది, నొప్పికి భయపడి చాలామంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రత్యేకించి రూరల్ ఏరియాల్లో సూది మందు మంచిది కాదంటూ అపోహలు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో ఆ భయం పొగొట్టేందుకు జైకోవ్-డి నీడిల్‌లెస్ వ్యాక్సిన్ విధానాన్ని తీసుకొచ్చింది. రేజర్ తరహాలో ఉండే టూల్‌తో జస్ట్ షాట్‌ను ఇస్తారు అంతే. పైగా వ్యాక్సిన్ తీసుకున్నాక నొప్పులు కూడా రావని చెప్తోంది కంపెనీ.
జైకోవ్-డి.. దేశీయంగా వచ్చిన రెండో వ్యాక్సిన్(మొదటిది కోవాగ్జిన్). జైడస్ క్యాడిల్లా రూపొందించిన మూడు డోసుల వ్యాక్సిన్. 28 నుంచి 56 రోజుల గడువుల వ్యవధితో రెండు భుజాలకు రెండేసి షాట్స్ చొప్పున(మొత్తం ఆరు షాట్స్) ఇస్తారు. ప్లాస్మిడ్ డీఎన్‌ఏ ప్లాట్‌ఫామ్‌తో డెవలప్ చేయడం వల్ల ఈ సూదిరహిత వ్యాక్సిన్‌ను ప్రత్యేకంగా భావిస్తున్నారు. ముందుగా పెద్దలకు, ఆపై 12-15 ఏళ్లలోపు పిల్లలకూ ఇచ్చేందుకు కూడా అనుమతి ఉంది.