అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌ను దోషిగా తేలుస్తూ ఆ దేశ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. దీంతో మాజీ ప్రధానుల్లో చెరసాలకు వెళ్తున్న తొలి వ్యక్తిగా నజీబ్ అప్రతిష్ట మూటగట్టుకోనున్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో ఆయనకు హైకోర్టు గతంలోనే 12 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ‘ఆయన చేసిన అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, మనీ లాండరింగ్ నేరాలకు తగిన శిక్షే ఇది’ అని హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల ఫెడరల్(సుప్రీం) కోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన తన జైలుజీవితం మొదలుపెట్టాలని ఆజ్ఞాపించింది.