కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకుసాగుతుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాజా కేంద్రబడ్జెట్లో పేదలకు పనికొచ్చేదేదీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రానికి మరోసారి కేంద్రం మొండిచెయ్యి చూపిందని, ఎన్ని విజ్ఞప్తులు చేసినా అన్నింటినీ బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. మున్సిపాలిటీల్లో మంచినీటి పథకాలకు రూ.వందల కోట్లు కేటాయిస్తున్నామని, చన్నీళ్లకు వేడినీళ్లు తోడు అన్నట్లుగా కేంద్రం నుంచి సహకారం ఆశించినా, నిరాశే మిగిలిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని జవహార్‌నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం పర్యటించిన కేటీఆర్ జిల్లామంత్రి మల్లారెడ్డితో కలసి రూ.306.99 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారం భోత్సవాలు చేశారు. ‘సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ ఏడేళ్లలో సాధించామ’ని కేటీఆర్ పేర్కొన్నారు. దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా ఎదగటమే కాకుండా, నాలుగోస్థానంలో రాష్ట్రముందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పథకాలన్నింటినీ యథావిధిగా కొనసాగిస్తా మన్నారు.