ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.
ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, సామాన్య మధ్యతరగతికి విద్యను మరింత చేరువ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై సమగ్ర అధ్యయనం జరపడంతో పాటు విధివిధానాల రూపకల్పన కోసం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కె.తారక రామారావుతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. వచ్చే శాసనసభా సమావేశాల్లో ఈ మేరకు నూతన చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుంది.