పిల్లల సక్రమ ఎదుగుదలకు సరైన ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారం కంటే జంక్‌ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. పోనీలే కదా అని తల్లిదండ్రులు చూసీ చూడనట్లు వదిలేస్తే పిల్లల ఆరోగ్యానికి అది చాలా హానికరం. అందువల్ల పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా నిరోధించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుందాం.
ముందుగా మనం ఒక విషయాన్ని నమ్మి తీరాలి. అదేమిటంటే మనం అంటే తల్లిదండ్రులు దేనిని ఆచరిస్తారో, పిల్లలు దానినే అనుసరిస్తారు. అంటే పెద్దవాళ్లు స్విగ్గీ, జొమాటోల్లో స్పైసీ ఫుడ్‌ను ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించుకుని వాళ్ల కళ్లముందే లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటే ఆటోమేటిగ్గా పిల్లలు కూడా అదే బాట పడతారు. అందువల్ల ముందుగా పెద్దవాళ్లకు గనక బయటి తిండి తినే అలవాటుంటే దానిని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం బెటర్. చక్కగా ఇంట్లోనే చేసుకుని తింటూ ఉంటే పిల్లలు కూడా ఇంట్లో అమ్మ చేతి వంట తినడానికే మొగ్గు చూపిస్తారు.