మండలంలోని మరూరు పంచాయతీ చాపట్ల గ్రామానికి చెందిన మేకల నడిపి కుళ్లాయప్ప, ఈశ్వరమ్మ దంపతులు. పెళ్లయిన తొమ్మిదేళ్లకు ఇద్దరు కవలలు పుట్టారు. పెద్ద కుమారుడు కుళ్లాయప్ప ప్రస్తుతం అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రెండో కుమారుడు ఆంజనేయులుకు మాయదారి జబ్బు వచ్చింది. తర్వాత నాలుగేళ్లకు అమ్మాయి కీర్తన జన్మించగా, తను కూడా మతిస్థిమితం కోల్పోయింది. వీరికి బత్తలపల్లి ఆర్డీటీ, అనంతపురంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఎముకల్లో సారం లేక పిల్లలు జబ్బు పడ్డారని, బెంగళూరు లేదా హైదరాబాదులోని ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తే కొంత వరకు నయమవుతుందని వైద్యులు తెలిపారు. వైద్యానికి ఒక్కొక్కరికి రూ.15 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు.