జీవనశైలి జబ్బులను నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం యువతకు ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. తాజా గణాంకాలను బట్టి చూస్తే మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్, పెరాలసిస్, గుండె జబ్బులు వంటివి ఎక్కువగా నమోదవుతున్నాయి. అన్నిటికంటే మానసిక జబ్బులు యువతపై ముప్పేట దాడి చేస్తున్నాయి. గతంతో పోలిస్తే.. ఇలాంటి జీవనశైలి జబ్బులకు బోధనాస్పత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తున్నా.. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
2021 జనవరి నుంచి బోధనాస్పత్రుల్లో నమోదవుతున్న ఔట్ పేషెంట్ సేవల తీరును ఎప్పటికప్పుడు హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్‌ఎంఐఎస్) పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎంతమేరకు జీవనశైలి జబ్బులు నమోదవుతున్నాయనేది తెలుస్తుంది. అలా మన రాష్ట్రంలో గడచిన 5 నెలల్లోనే (ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ) 1.30 లక్షల మందికి పైగా ఔట్ పేషెంట్లు జీవనశైలి జబ్బులతో చికిత్సకు వచ్చారని తేలింది. ఇవి కేవలం 11 బోధనాస్పత్రుల్లో నమోదైన కేసులు మాత్రమే. పీహెచ్‌సీలు మొదలుకొని జిల్లా ఆస్పత్రుల వరకూ నమోదైన కేసులు అదనం.