ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది మొట్టమొదటిసారి 100 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్)తాజాగా ఈ అంచనాలను వెలువరించింది. నిజానికి ఈ స్థాయిని ప్రపంచ ఎకానమీ 2024కు అందుకుంటుందని తొలుత సీఈబీఆర్ అంచనావేసింది. ఇక 2030 నాటికి చైనా ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికాను పక్కకునెట్టి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందని సీఈబీఆర్ అంచనావేసింది. ఈ విషయంలో అంచనాలకన్నా చైనా రెండేళ్లు వెనకబడిందని నివేదిక వివరించింది. కాగా, 2021లో 194 దేశాల ఆర్థిక వ్యవస్థల పరిమాణం దాదాపు 94 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రపంచ ఆర్థిక పరిమాణంపై తాజా సీఈబీఆర్ అంచనా ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలకు అనుగుణంగా ఉండడం గమనార్హం.