కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రెజరీ కార్యాలయాలు సెలవు రోజైన ఆదివారం సైతం శరవేగంగా బిల్లుల ప్రాసెస్ నిర్వహించాయి. ఆర్థికశాఖ ఆదేశాలతో ప్రత్యక్షంగా కలెక్టర్లే రంగంలోకి దిగి ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నెలాఖరు కావడంతో సాయంత్రం కల్లా పూర్తి చేసేలా అన్ని జిల్లాల్లో ప్రాసెస్ జరుగుతోంది.
శని, ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రెజరీ ఉద్యోగులు బిల్లులను అప్‌లోడ్ చేశారు. ట్రెజరీల్లో సుమారు 2 లక్షల బిల్లులు కొత్త పీఆర్సీ ప్రకారం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పే అండ్ అకౌంట్స్‌లో 50 వేల బిల్లులను అధికారులు ప్రాసెస్ చేశారు. ఆర్థికశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బిల్లులు సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి పెన్షనర్ల బిల్లులను ఉద్యోగులు సిద్ధం చేయనున్నారు. కాగా, 1వ తేదీ వరకు ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ సన్నద్ధమవుతుంది.