అన్నదాతలకు ఇకపై ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ సమస్యలకు చెక్ పెట్టింది. పంటల నమోదు కోసం ఉపయోగిస్తున్న ఆర్బీ యూడీపీ (రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్)యాప్‌ను అప్డేట్ చేసింది. ఇందుకోసం గడిచిన 45 రోజులుగా నిలిపి వేసిన పంటల నమోదును మంగళవారం తిరిగి ప్రారంభించింది. పంటల నమోదును ఈనెలాఖరుకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు యాప్‌లో గ్రామం పేరు కొట్టగానే కొన్ని సందర్భాల్లో ఇతర జిల్లాల్లో అదే పేరుతో ఉన్న గ్రామాల జాబితా ప్రత్యక్షమవుతుండటంతో రైతు ఏ గ్రామానికి చెందిన వారో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ క్రాప్ డేటా–సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డేటాతో పూర్తి స్థాయిలో అనుసంధానంకాకపోవడం వల్ల కూడా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇలా గడిచిన ఖరీఫ్ సీజన్‌లో రైతులు, సిబ్బందికి ఎదురైన వివిధ రకాల సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తూ ఆర్బీ యూడీపీ యాప్‌ను అప్డేట్ చేశారు.