రైతులు తాము పండించిన పంటను కళ్లాల నుంచే నేరుగా నచ్చిన ధరకు అమ్ముకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మార్కెట్ ద్వారా కల్పిస్తోంది. రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్‌లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా రూపొందించిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ఇదే కావడం గమనార్హం. మండీలకు ప్రత్యామ్నాయంగా తెచ్చిన ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రైతులను రాష్ట్ర పరిధిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ ట్రేడర్స్‌తో అనుసంధానిస్తారు. నాణ్యమైన ఉత్పత్తులు, నిల్వ సామర్థ్యం, ఆర్ధిక చేయూత లాంటి సేవలను ఒకే వేదిక కిందకు తీసుకు రావడం ద్వారా అవాంతరాలు లేని వాణిజ్యాన్ని సృష్టించాలన్న సంకల్పంతో ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం తెచ్చింది. వ్యవసాయ రంగంలో డిజిటల్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టి మార్కెటింగ్ విలువను పెంచుతున్నారు.