పోలూరు సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న భర్త ఏడాదికే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బాధిత యువతి చంటి బిడ్డతో అత్తగారింటి ముందు ధర్నాకు దిగింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపంలోని పాపంబాడి గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు పూఅరసన్(22), చెన్నైలో మినీ వ్యాన్ నడుపుతున్నాడు. ఆ సమయంలో కల్లకుర్చికి చెందిన అమ్ము(22) తో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు.
అనంతరం ఇరు కుటుంబ సభ్యులు సమ్మతించడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా గత రెండు నెలల క్రితం పూఅరసన్ ఓ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న అమ్మును అమ్మగారింటికి పంపి వేశారు. అనంతరం భర్త కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అమ్ము తన వివాహం సమయంలో వేసిన బంగారం, వస్తువులు, సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరింది.