కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు చేపట్టేందుకు, రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తక్షణమే పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనల అమలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, ఆక్సిజన్, పరికరాలు అందుబాటులో ఉంచడం, హోం ఐసొలేషన్ కిట్లు సరఫరా, ఫీవర్ సర్వే, అత్యవసర మందులు తదితర అంశాలను సమర్ధంగా పర్యవేక్షించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారులతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.