తెలంగాణ ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్ అనంతరం మాట్లాడారు. 1948 సెప్టెంబరు 17న సువిశాల భారత్ లో హైదరాబాద్ రాష్ట్ర విలీనమైందని చెప్పారు. తెలంగాణకు సెప్టెంబరు 17న రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం సిద్ధించిందని తెలిపారు. స్వాతంత్ర్యానికి పూర్వం భారత్ లో అనేక ప్రాంతాలు వేర్వేరు పాలకుల చేతుల్లో ఉండేవని అన్నారు. స్వదేశీ సంస్థానాలు వేర్వేరు సమయాల్లో భారత్ లో విలీనం అయ్యాయని చెప్పారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి పోరాటం మరవలేనిదని అన్నారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి తెలంగాణ పరివర్తన చెందిందని, అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు.