ఆయువు తీరిన తార తనలోకి తాను కుంచించుకుపోయే క్రమంలో ఏర్పడే అనంత గురుత్వాకర్షణ శక్తి కేంద్రం. సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కాంతితో సహా సర్వాన్నీ శాశ్వతంగా తనలోకి లాక్కుంటుంది. దాని గుండా కాంతి కూడా ప్రసరించలేదు గనక కృష్ణబిలం (బ్లాక్‌హోల్) ఎలా ఉంటుందో మనం చూసే అవకాశం లేదు. అలాంటి కృష్ణబిలం నాసా శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తొలిసారి ‘వినిపించింది’. ఇందుకోసం 2003లో సేకరించిన ఒక కృష్ణబిలం తాలూకు డేటాకు శాస్త్రీయ పద్ధతిలో నాసా శబ్ద రూపమిచ్చింది. దాని కేంద్రం నుంచి అన్నివైపులకూ ఊహాతీతమైన వేగంతో నిత్యం వెలువడే అతి తీవ్రమైన ఒత్తిడి తరంగాలను శబ్ద రూపంలోకి మార్చి విడుదల చేసింది.