ఓ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తరువాత.. ఆ వ్యక్తిపై మరే ఇతర కేసులు లేనప్పుడు రౌడీషీట్ కొనసాగించడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మర్రి గోపి అనే వ్యక్తిపై రౌడీషీట్ కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ, వెంటనే అతనిపై రౌడీషీట్‌ను మూసివేయాలని గుంటూరు జిల్లా, మంగళగిరి పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల తీర్పునిచ్చారు. పోలీసులు తనపై రౌడీషీట్ తెరవడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన మర్రి గోపి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు.