గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కొత్తగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించింది. గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఆ గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలోనే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపులకు వీలుగా ప్రతి పంచాయతీ పేరిట బ్యాంకుల్లో ముందస్తుగానే నిధుల జమకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీ పేరిట ఇప్పటికే బ్యాంకుల్లో (వ్యక్తిగత ఖాతాలను) పీడీ ఖాతాలను తెరిచింది. ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వ ట్రెజరీ అనుమతి తీసుకోవడం వంటివి కూడా ఉండవు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలకు కేటాయించే దాదాపు రెండు వేల కోట్లకు పైగా నిధులను ఏటా ఆయా బ్యాంకు ఖాతాల్లో జమచేసే అవకాశముంది.