ఉత్తరప్రదేశ్‌లో పెద్ద జిల్లాల్లో ఒకటైన ఆగ్రాలో ఆధిపత్యం సాధించేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. జాటవ్, బ్రాహ్మణ, ఠాకూర్, జాట్, ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలోని 9 నియోజకవర్గాలను మరోమారు క్లీన్‌స్వీప్ చేసేందుకు అధికార బీజేపీ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తుండగా, 30 ఏళ్ల తమ పార్టీ చరిత్రలో ఒకేఒక్కసారి ఒకేఒక్క సీటును గెలుచుకున్న ఎస్పీ ఈ మారు చరిత్ర తిరిగిరాసే యత్నాల్లో మునిగింది.
యాభై లక్షలకు పైగా జనాభా ఉన్న ఆగ్రాలో ఆగ్రా కాంట్, ఆగ్రా నార్త్, ఆగ్రా రూరల్, ఆగ్రా సౌత్, బాహ్,ఎత్మాద్‌పూర్,ఫతేహాబాద్, ఫతేపూర్‌సిక్రీ, ఖేరాఘర్ నియోజకవర్గాలున్నాయి. బాహ్ పరిధిలో బ్రాహ్మణ ఓటర్లు అధికంగా ఉండగా, రెండో స్థానంలో ఠాకూర్‌లు ఉన్నారు. ఫతేపూర్‌సిక్రీ, ఖేరాఘర్, ఎత్మాద్‌పూర్‌లో బ్రాహ్మణ, ఠాకూర్‌ల ఆధిపత్యం ఉన్నప్పటికీ మల్లాలు,కుష్వాహా, జాటవ్, వాల్మీకిలు గణనీయ సంఖ్యలో ఉన్నారు.